విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం: భారీ ఆస్తినష్టం!!


 విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో శనివారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదవశాత్తు ఎన్‌ఎఎఫ్‌సి యూనిట్‌ లో మంటలు చెలరేగాయి. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ లో దట్టమైన పొగ కమ్మేసింది. స్టీల్ ప్లాంట్ లోని కోకోవెన్‌ విభాగంలో ఉన్న నాఫ్తలీన్‌ యూనిట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని సమాచారం. కోకోవెన్ యూనిట్‌లో వెల్డింగ్‌ పనులు చేస్తుండగా ఒక్కసారిగా నిప్పు రవ్వలు ఎగసి పడి అగ్నిప్రమాదానికి కారణంగా మారిందని తెలుస్తుంది. ఈ అగ్ని ప్రమాదంలో విద్యుత్ పరికరాలు, యంత్రాలు, అక్కడ ఉన్న మెటీరియల్ అంతా పూర్తిగా కాలిపోయాయి. 

 
నాఫ్తలీన్ యూనిట్ లోని నాఫ్తలీన్ అంతా దగ్ధమైంది. ఈ అగ్నిప్రమాదంపై వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. అక్కడికి చేరుకుని ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టమేమీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం భారీగా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ అగ్నిప్రమాదం నేపధ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారంలో పని చేసే ఉద్యోగుల, కార్మికుల కుటుంబాలు టెన్షన్ పడ్డాయి. ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నాయి. మరోవైపు ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే గతంలో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
Previous Post Next Post