Telangana : తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చి మూణ్నాళ్లు కాలేదు అప్పుడే లడాయి షురూ అయింది. ముందటి ప్రభుత్వపు ట్రేడ్ మార్కు పనులను టార్గెట్ చేసి మరీ కొడుతున్నారు కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కోటి ఎకరాల మాగాణం ఘనకీర్తి, కేసీఆర్ భుజకీర్తి కాళేశ్వరం ప్రాజెక్టుపైనే ఫోకస్ పెట్టారు. కృష్ణాబోర్డు విషయంలో కొత్త ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టడానికి కేసీఆర్ కొత్త ఉద్యమం ఎత్తుకుంటే... పాత ప్రాజెక్టులో బొక్కలు బయటకు తీసి.. లెక్కలు తేలుస్తానంటూ రేవంత్ రెడ్డి బయలుదేరారు. బయలుదేరడమంటే అట్లా ఇట్లా కాదు మందీమార్బలంతోటి నేరుగా ప్రాజెక్టు మీదనే ప్రెస్‌మీట్ పెట్టారు. మేడిగడ్డలో మీరు చేసేదేం లేదు మీ సంగతి తేలుస్తా అంటూ కేసీఆర్ సవాలు చేశారు. మొత్తం మీద రెండు పార్టీల హోరాహోరీకి రెడీ అవ్వడంతో సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయం రంజుగా మారిపోయింది.
వాటర్ సెంటిమెంట్‌తో కేసీఆర్ కమ్ బ్యాక్ పాలిటిక్స్ !
నువ్వు కృష్ణా ప్రాజెక్టులకు అన్యాయం చేస్తున్నావు.. అని కేసీఆర్ అంటే.. నువ్వు గోదావరి ప్రాజెక్టుల్లో ఆల్రెడీ అన్యాయం చేసేశావ్ అని రేవంత్ అంటున్నారు. కృష్ణా జలాల్లో హక్కుల కోసం అని బీఆర్‌ఎస్ వాళ్లు మీటింగ్ తలపెడితే.. రాయలసీమ ఎత్తిపోతలకు సహకరించి ఆ హక్కుల కాలరాసింది మీరే అంటూ కాంగ్రెస్ వాళ్లు తగులుకుంటున్నారు. ఫలితంగా డ్యాముల్లో నీళ్లకు బదలు నిప్పులు పారుతున్నట్లైంది పరిస్థితి. తెలంగాణ అస్థిత్వమే నీళ్లు పై ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలకు.. ఉద్యమానికి ఇంధన వనరు.... ఈ నీళ్లే. అలాంటి నీళ్ల పంచాయతీ మళ్లీ మొదలైంది. అయితే ఈసారి ఇది పొరుగు రాష్ట్రంలో కాదు... నీళ్ల వాటాల్లో హక్కుల కోసం ఇన్నాళ్లు నడిచిన వివాదం.. ఇప్పుడు రాజకీయ ఆథిపత్యం కోసం ఇంటర్నల్‌గా నడుస్తోంది.
అసలు ప్రాజెక్టులు అప్పగించిందే బీఆర్ఎస్ సర్కారని పత్రాలు బయట పెట్టిన కాంగ్రెస్
బీఆర్‌ఎస్ వ్యూహాన్ని ముందుగానే పసిగట్టిన ప్రభుత్వం KRMB విషయంలో అప్పటి ప్రభుత్వం తప్పు చేసిందని నిరూపించే ప్రయత్నం చేసింది. అప్పటి ముఖ్య కార్యదర్శి స్మితా సభర్వాల్ తెలంగాణ ప్రాజెక్టులను యాజమాన్య బోర్డుకు అప్పగించేందుకు అంగీకరిస్తూ లేఖ రాశారని బయటపెట్టింది. దానిని సరిదిద్దడానికే ప్రాజెక్టులను KRMB కి అప్పగించమనే తీర్మానం చేస్తున్నామని .. దీనికి బీఆర్‌ఎస్ సహకరించాలని చెప్పింది. దీంతో బీఆర్‌ఎస్ కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది. సభలో ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా ముప్పేట దాడి చేస్తుంటే.. హరీష్‌రావు ఒక్కరే ప్రతిఘటించారు. కృష్ణా ప్రాజెక్టులపై రాద్దాంతం చేస్తున్న బీఆర్‌ఎస్ రాయలసీమ ఎత్తిపోతలకు సహకరించిందని కాంగ్రెస్ బాంబు పేల్చింది. రాయలసీమ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకూ కేసీఆర్ ఉద్దేశ్య పూర్వకంగా అపెక్స్ కమిటీ సమావేశానికి గైర్హాజరయ్యారని.. బయటపెట్టింది. ఇది బీఆర్‌ఎస్‌ను దెబ్బతీసింది.
బహిరంగసభకు పోటీగా మేడిగడ్డ పంచాయతీ పెట్టిన రేవంత్
ఓ వైపు కృష్ణా ప్రాజెక్టులపై దాడి కొనసాగిస్తూనే రేవంత్ పాత అస్త్రాన్ని బయటకు తీశారు. కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం ను టార్గెట్ చేశారు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేడిగడ్డ ప్రాజెక్టులో పిల్లర్లు కుంగిపోవడంతో బీఆర్‌ఎస్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఎన్నికల్లో గెలిచిన వెంటనే దానిపై విజిలెన్స్ ఎంక్వైరీ వేసి అవకాశం కోసం చూస్తున్న రేవంత్ సరైన సమయంలో టార్గెట్ ఫిక్స్ చేశారు. కేసీఆర్ నల్లగొండ సభ పెట్టిన రోజునే ఆయన మేడిగడ్డ యాత్ర మొదలుపెట్టారు. కాళేశ్వరం వెళదాం రండి రావుగారూ అంటూ కేసీఆర్‌ను టీజ్ కూడా చేశారు. డ్యామ్ సైట్ దగ్గరకు వెళ్లి మరీ పబ్లిక్ ఇన్‌స్పెక్షన్ చేశారు. ఏ ప్రాజెక్టు గురించైతే బీఆర్‌ఎస్ ఘనంగా చెప్పుకుందో.. అదే తెలంగాణ తలమానికం అని చాటుకుందో దానినే దెబ్బతీసేందుకు రేవంత్ యత్నించారు. కాళేశ్వరం పారింది నీళ్లు కాదు.. నిధులు మాత్రమే అన్నారు. కేసీఆర్ చెప్పినట్లు కోటి ఎకరాలకు నీళ్లు రాలేదని కేవలం 90వేల ఎకరాలకు మాత్రమే నీళ్లిచ్చారని చెప్పారు. లక్ష ఎకరాలు కూడా తడవకుండానే లక్షకోట్లు ఖర్చుచేశారని తేల్చేశారు. ఓ వైపు రేవంత్ మీటింగ్ జరుగుతుండగానే మేడిగడ్డలో “మీరేం తేలుస్తారు.. నేను మీ అందరి సంగతి తేలుస్తా” అంటూ కేసీఆర్ నల్లగొండ నుంచి హుంకరించారు.
ముందు ముందు ఉద్రిక్త స్థాయిలో తెలంగాణ పొలిటికల్ జంగ్
కొత్త ప్రభుత్వం వచ్చిన రోజుల వ్యవధిలోనే జలజగడం హీటెక్కింది. నీళ్లు నిప్పులై మండుతున్నాయి. ప్రజల్లో మళ్లీ పరపతి పెరగాలంటే పోరాట పంథానే ముఖ్యం అనుకున్న బీఆర్ఎస్.. టీఆర్‌ఎస్ తరహాలో విజృంభించేందుకు సిద్ధమవుతోంది. ఆల్రెడీ దెబ్బతిన్న పార్టీని రెక్కలు విరచాలంటే.. వారి ఆయువుపట్టుపై కొట్టాలన్నట్లుగా రేవంత్ జోరు కనిపిస్తోంది. అందుకు కాళేశ్వరం కృంగిపోవడం కలిసొచ్చింది. మరి రేవంత్ అంత తేలిగ్గా వదులుతారా.. ? మొత్తం మీద రెండు పార్టీల రభస ముందు ముందు పరిస్థితి ఎలా ఉండబోతోందో చెబుతోంది.
Tags
Telamgana