ఏపీలో వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సీటు కోల్పోయారు. ఆయన్ను నరసరావుపేట నుంచి గుంటూరు ఎంపీగా వెళ్లి పోటీ చేయాలని సీఎం జగన్ కోరడంతో అందుకు అంగీకరించలేదు. నరసరావుపేట వదిలి గుంటూరుకు వెళ్లేది లేదని తేల్చిచెప్పేశారు. ఆ తర్వాత క్యాడర్ లోనూ తన పోటీపై గందరగోళం నెలకొందని, అందుకే వైసీపీని వీడుతున్నట్లు కూడా ప్రకటించారు. అనంతరం చంద్రబాబుతో భేటీ అయిన లావు శ్రీకష్ణదేవరాయలు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఈసారి కూడా నరసరావుపేట నుంచే ఆయన పోటీ చేస్తున్నారా లేక మరే ఇతర సీటులో ఆయన్ను టీడీపీ రంగంలోకి దింపబోతోందా అన్న సస్సెన్స్ నెలకొంది. దీనికి లావు ఇవాళ సమాధానం చెప్పేశారు.
చంద్రబాబుతో ఈ మధ్యే తన సీటుపై చర్చలు జరిపిన లావు.. తాను మరోసారి నరసరావుపేట నుంచే బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. నరసరావుపేట లోక్ సభ స్ధానం నుంచి తిరిగి పోటీ చేసేందుకు సిద్దమవుతున్న లావు శ్రీకృష్ణదేవరాయలు.. ఇవాళ్టి నుంచి ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. స్ధానికంగా ఉన్న వ్యాపార వర్గాల్ని, ఇతర కీలక నేతల్ని ఆయన వరుసగా కలుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తనకు మద్దతివ్వాలని ఆయన కోరుతున్నారు. నరసరావుపేట సీటు నుంచి లావు తిరిగి పోటీ నేపథ్యంలో పల్నాడు జిల్లాలో పరిస్ధితుల్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
Tags
Andra Pradesh