మహబూబాబాద్ జిల్లాలో దారుణం - మంత్రాల నెపంతో తల్లి, కొడుకు హత్య


 Mahabubnagar: మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. గూడూరు (Gudur) మండలం కేంద్రంలో మంత్రాలు చేస్తున్నారనే నెపంతో తల్లీ కొడుకులను ఓ వ్యక్తి దారుణంగా హతమార్చాడు. సమ్మన్న అనే వ్యక్తి కుటుంబం గత కొన్నేళ్లుగా చేతబడి చేస్తుందనే నెపంతో కుమారస్వామి కుటుంబం వారితో గొడవలు పడుతోంది. ఇరు కుటుంబాలపై పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలో సమ్మన్న ఐదేళ్లుగా వరంగల్ లో ఉంటుండగా.. కుమారస్వామి గూడూరులోనే నివాసం ఉంటున్నాడు. మంగళవారం పోలీస్ స్టేషన్ లో ఇరు కుటుంబాలు హాజరై తిరిగి వెళ్తుండగా.. వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన కుమారస్వామి సమ్మన్న (40), అతని తల్లి సమ్మక్క (60), తండ్రిపై ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి, కుమారుడు అక్కడిక్కడే మృతి చెందాడు. తండ్రికి తీవ్ర గాయాలు కాగా.. అతన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. స్థానికులు నిందితున్ని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Previous Post Next Post